భూసేకరణపై రీ-సర్వే చేయాలి

కాటారం, బిబిఎంఏ న్యూస్: చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వల నిర్మాణానికి చేపట్టిన భూసేకరణ ప్రాథమిక సర్వేలో రైతులకు సమాచారం ఇవ్వకుండా సర్వే నిర్వహించారని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ ఆరోపించారు. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని వెంటనే రీ-సర్వే చేయాలని భూసేకరణ అధికారి, ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం బహిరంగ మార్కెట్ విలువకు అనుగుణంగా నాలుగు రెట్లు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాల్వల నిర్మాణంతో ఇరువైపులా భూములు వ్యవసాయానికి పనికిరాకుండా పోతున్నాయని తెలిపారు. రైతుల పేర్లు భూసేకరణ జాబితాలో లేకపోవడం, అభ్యంతరాలు పరిష్కరించకుండానే అవార్డు దశకు వెళ్లడం సరికాదన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే రిలే నిరాహార దీక్షలు, రాస్తారోకోలు, వంటావార్పు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో చిన్న రాజేందర్, రాజ్కుమార్, మల్లయ్య, పోచయ్య, పద్మ తదితర రైతులు పాల్గొన్నారు.