బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: సీపీ అంబర్ కిషోర్ ఝా

రామగుండం, ఆగస్టు 17 (బిబిఎంఏ న్యూస్): బాధితుల నుంచి అందిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి, చట్టపరమైన నిబంధనల ప్రకారం సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం సీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను సీపీ దృష్టికి తీసుకువచ్చారు. ఫిర్యాదులను స్వయంగా పరిశీలించిన సీపీ, సంబంధిత అధికారులతో మాట్లాడి పారదర్శకంగా విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. ప్రతి ఫిర్యాదును బాధ్యతగా పరిగణించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ కె. శ్రీనివాస్ పాల్గొన్నారు.