రూపారెడ్డి హత్యకు నిరసనగా క్యాండిల్ ర్యాలీ
గోదావరిఖని, బిబిఎంఏ న్యూస్: ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్యను నిరసిస్తూ టీపీటీఎఫ్, టీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో గోదావరిఖని చౌరస్తాలో గురువారం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఆవుల రాజేష్ యాదవ్, టీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ పోకల నాగయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయురాలి హత్య నాగరిక సమాజానికి సిగ్గుచేటన్నారు. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే తల్లిదండ్రులు క్రమశిక్షణ పెంపొందించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకురావాలని, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల రక్షణకు ప్రత్యేక చట్టం రూపొందించాలని డిమాండ్ చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. రేపటి రాష్ట్ర బంద్ను పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు సంపూర్ణంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సుద్దాల శ్రీనివాస్, పావని శ్రీనివాస్, దాసరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.